సర్వే కోసం వచ్చామంటూ చోరీ

సర్వే కోసం వచ్చామంటూ చోరీ
  • వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి 18 తులాల బంగారం అపహరణ
  • ఖమ్మం జిల్లా వైరా సుందరయ్య నగర్‌‌లో ఘటన

వైరా, వెలుగు : సర్వే పేరుతో ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధురాలిపై దాడి చేసి సుమారు రూ. 15 లక్షల విలువైన నగలతో పరారయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్‌‌లో బుధవారం వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వైరా సుందరయ్యనగర్‌‌కు చెందిన శీలం యుగంధర్‌‌రెడ్డి కొత్తగూడెంలోని పాలిటెక్నిక్‌‌ కాలేజీలో ఉద్యోగం చేస్తుండగా, అతడి భార్య లలిత వైరాలోని ఓ ప్రైవేట్‌‌ స్కూల్‌‌లో పనిచేస్తోంది.

బుధవారం ఉదయం 9 గంటలకు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లడంతో యుగంధర్‌‌రెడ్డి తల్లి వెంకట్రావమ్మ ఒక్కతే ఇంట్లో ఉన్నారు. ఉదయం 11 గంటల టైంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో యుగంధర్‌‌రెడ్డి ఇంటికి వచ్చారు. అతడి తల్లి వెంకట్రావమ్మను కలిసి తాము సర్వే చేసేందుకు వచ్చామని చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు. తర్వాత ఆమెపై దుప్పటితో ముసుగు వేసి విచక్షణారహితంగా కొట్టి, కాళ్లు, చేతులు కట్టేయడంతో పాటు కేకలు వేయకుండా నోటికి ప్లాస్టర్‌‌ వేసి బెడ్‌‌రూమ్‌‌లో బంధించారు. అనంతరం బీరువాలో ఉన్న 18 తులాల బంగారు నగలను తీసుకొని పరారయ్యారు.

మధ్యాహ్నం ఒంటి గంట టైంలో లలిత భోజనానికి ఇంటికి రావడంతో చోరీ విషయం బయటపడింది. వెంటనే వైరా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ రహమాన్‌‌, సీఐ నునావత్‌‌ సాగర్‌‌, ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజు సంఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారమే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చి...

కోరుట్ల, వెలుగు : అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చిన ఇద్దరు యువతులు వృద్ధురాలి మెడలోంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్‌‌ మండలం ఊట్‌‌పల్లిలో బుధవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గజ్జెల్లి లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. బుధవారం ఇద్దరు మహిళలు లక్ష్మి వద్దకు వచ్చి అనాథాశ్రమానికి చందా ఇవ్వాలని, వివరాలు నమోదు చేసుకునేందుకు ఆధార్‌‌ కార్డు చూపించాలని కోరారు.

ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడి లక్ష్మి చేతులు, నోరు గట్టిగా పట్టుకొని ఆమె మెడలో ఉన్న ఏడు తులాల బంగారు గొలుసును లాక్కున్నారు. తర్వాత ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలి ఏడుపు విన్న చుట్టుపక్కల వారు గడియ తీసి విషయం తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై నవీన్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గ్రామంలో సీసీ ఫుటేజీలను పరిశీలించి మహిళల వివరాలు ఆరా తీస్తున్నారు.